జన గళం ఉత్తరాంధ్ర డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికల వేళ పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పురపాలక సంఘం పీఠం ఎన్డీయే కూటమిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాలూరు మున్సిపల్ ఛైర్మన్ స్థానాన్ని కూటమి సర్దుబాటులో భాగంగా జనసేన పార్టీకి కేటాయించడంపై స్థానిక శాసనసభ్యురాలు, రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నియోజకవర్గంలో రెండు శాతం ఓటు బ్యాంకు కూడా లేని జనసేనకు మున్సిపల్ ఛైర్మన్ వంటి కీలక స్థానాన్ని ఎలా కేటాయిస్తారంటూ ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
సాలూరు మున్సిపాలిటీ పరిధిలో టీడీపీకి పూర్తి స్థాయి క్యాడర్ బలం ఉండటంతో ఛైర్మన్ పీఠం తమ పార్టీకే దక్కుతుందని భావించిన నేతలు, కార్యకర్తలు అధిష్టానం నిర్ణయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తక్షణమే రంగంలోకి దిగారు. మంత్రి సంధ్యారాణితో పాటు తీవ్ర అసంతృప్తితో ఉన్న స్థానిక టీడీపీ నాయకులు, కేడర్తో ప్రత్యేకంగా మాట్లాడి వారిని బుజ్జగించారు. కూటమి విస్తృత ప్రయోజనాలు, పార్టీల మధ్య సర్దుబాటు ఒప్పందాలను దృష్టిలో పెట్టుకుని సంయమనం పాటించాలని ఆయన కోరినట్లు సమాచారం.
