విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో ఎదురైన స్వల్ప తేడా ఓటమిపై నాయకుడు శ్రీ ముత్యాల వెంకట కామేశ్వరరావు (కామేష్) గారు అత్యంత హుందాగా, భావోద్వేగభరితంగా స్పందించారు. ప్రజా తీర్పును శిరసావహిస్తూ ఈ ఓటమిని ఒక బాధ్యతగా స్వీకరిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తనను నమ్మి అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, అయితే ప్రజలు తనపై చూపించిన అపారమైన ప్రేమ, ఆప్యాయతలు జీవితాంతం గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. గత 18 సంవత్సరాల ప్రజా జీవితంలో ఒక్క తప్పు కూడా చేయకుండా, రూపాయి అవినీతికి తావులేకుండా, సొంత ధనాన్ని సైతం ప్రజాసేవకే వెచ్చించి అత్యంత నీతి, నిజాయితీలతో ప్రజల మధ్య నిలబడ్డానని గుర్తుచేశారు. అటువంటి 18 ఏళ్ల సుదీర్ఘ నిస్వార్థ సేవకు ఫలితంగా కేవలం 18 ఓట్ల స్వల్ప తేడాతోనే ఓటమి ఎదురైనా, దానిని భగవంతుడు ఇచ్చిన పరీక్షగా భావిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో తనకు అండగా నిలిచి పోరాడిన కుటుంబ సభ్యులకు, మిత్రులకు, వార్డులోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నికల్లో గెలిచినా ఓడినా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఎల్లప్పుడూ ప్రజల మధ్యే ఉంటూ ప్రజాసేవను కొనసాగిస్తానని శ్రీ కామేష్ గారు స్పష్టం చేశారు.
