రాజానగరం/తూర్పు గోదావరి: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల పరిషత్ ఎన్నికల ఫలితాల్లో తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. స్థానిక జనసేన శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారికి ఈ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీతానగరం జడ్పీటీసీ స్థానం నుంచి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారి సతీమణి శ్రీమతి వెంకటలక్ష్మి పోటీ చేయగా, ఆమె అనూహ్యంగా ఓటమి పాలయ్యారు.
రాష్ట్రవ్యాప్తంగా పరిషత్ పోరులో కూటమి ప్రభంజనం వీచినప్పటికీ, సీతానగరం మండలంలో మాత్రం వైఎస్సార్సీపీ అభ్యర్థి జయకేతనం ఎగురవేశారు. వైఎస్సార్సీపీ తరఫున బరిలో నిలిచిన కరుటూరి శ్రీహరిబాబు 2,600 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సతీమణి బరిలో నిలిచినప్పటికీ ఇక్కడ ఫలితం తారుమారు కావడం స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. క్షేత్రస్థాయి రాజకీయ సమీకరణాలు, మండల పరిధిలోని గ్రూపు రాజకీయాలే ఈ ఫలితానికి కారణమై ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
