3కి 3 జడ్పీటీసీలు.. 32కి 28 ఎంపీటీసీలు కైవసం.. గుడివాడలో కూటమి సునామీ
నందివాడలో చరిత్ర సృష్టించాం…తొలిసారి జడ్పీటీసీ, ఎంపీపీ మనదే:ఎమ్మెల్యే రాము
గుడ్లవల్లేరులో 2024 కంటే ఎక్కువ ఓట్లు – 70 శాతం పైగా కూటమికే జై కొట్టిన ఓటర్లు…
ఈ విజయం కూటమి ప్రభుత్వానికి మనం ఇస్తున్న బహుమతి:ఎమ్మెల్యే రాము
పని చేసేవాడికే ప్రజలు పట్టం కడతారు… ఫలితాల్లో ఇదే రుజువైంది
ఓడిన 4 స్థానాల బాధ్యత నాదే బాధ్యతగా తీసుకుంటా…
జిల్లాలోనే నెం.1 రిజల్ట్ గుడివాడదే…మున్సిపల్ రిజల్ట్ కూడా ముందే తేలిపోయింది
ఇప్పుడు వచ్చిన ఫలితాలను మించి…మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తాం
నాయకుడు అంటే పారిపోకూడదు…ముందుండి నడిపించాలి..నమ్ముకున్న వారినే మోసం చేశారు
దమ్ము అంటే పిచ్చి ఛాలెంజ్ లు చెయ్యడం కాదు.. ప్రజల కోసం పని చేయడం
పదవి అలంకారం కాదు…..గెలిచిన అందరూ బాధ్యతగా పనిచేయండి
గుడివాడ నవంబర్ 09: గుడివాడ నియోజకవర్గంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రజా ప్రతినిధులతో గుడివాడ ప్రజా వేదికలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సోమవారం భేటీ అయ్యారు.
గుడివాడ రూరల్, నందివాడ, గుడ్లవల్లేరు మండలాలకు చెందిన జడ్పీటీసీలు అంగడాల భారతి, దుడ్ల ప్రదీప్ కుమార్, వర్రె బలరామకృష్ణ, ఎంపీటీసీలు, కూటమి నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. విజేతలను ఎమ్మెల్యే రాము ఆలింగనం చేసుకుని అభినందించారు. మహిళా ప్రజా ప్రతినిధులకు నమస్కరిస్తూ అభివాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ 3 జడ్పీటీసీలకు మూడు, 32 ఎంపీటీసీలకు 28 స్థానాల్లో ఘన విజయం సాధించామన్నారు. నందివాడలో 44 ఏళ్ల టీడీపీ చరిత్రలో తొలిసారి జడ్పీటీసీ, ఎంపీపీ గెలవడం చారిత్రాత్మకమని చెప్పారు. గుడ్లవల్లేరులో 2024 కంటే ఎక్కువ శాతంతో గెలిచామని, చాలా గ్రామాల్లో 69-71% ఓట్లు కూటమికే వచ్చాయని తెలిపారు. ప్రజల కోసం పని చేస్తున్నామని, అందుకే ప్రజలు మాకు అండగా నిలిచారని అన్నారు. ఈ విజయాన్ని కూటమి ప్రభుత్వానికి బహుమతిగా ఇస్తున్నామని పేర్కొన్నారు.
పని చేస్తేనే ప్రజలు మెప్పుతారని నమ్ముతానని, అదే ఈ ఫలితాల్లో రుజువైందని స్పష్టం చేశారు. ఓడిన నాలుగు స్థానాల బాధ్యత తానే తీసుకుంటున్నానని అన్నారు. జిల్లాలోనే ఉత్తమ ఫలితాలు గుడివాడలో వచ్చాయని, దీంతో మున్సిపల్ ఫలితాలు ముందే తెలిసిపోయాయని చెప్పారు. రానున్న గుడివాడ మున్సిపల్ ఎన్నికల్లో దీనికి మించిన మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
నాయకుడంటే ముందుండి నడిపించాలని, పారిపోకూడదని ఎద్దేవా చేశారు. నమ్ముకున్న సొంత వారిని సైతం మోసం చేశారని విమర్శించారు. దమ్ము అంటే ప్రజల కోసం పని చేయడమే తప్ప , ఓడిపోతే బూట్లు తుడుస్తా, అని పిచ్చి ఛాలెంజ్ లు చేయడం కాదని అన్నారు. పదవి అలంకారం కాదు, బాధ్యత అని, నూతనంగా గెలుపొందిన అందరూ బాధ్యతగా పని చేయాలని సూచించారు.
అనంతరం జడ్పీటీసీలు వర్రె బలరామకృష్ణ, అంగడాల భారతి, దుడ్ల ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ తమను గెలిపించిన ప్రజలకు, కూటమి శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే రాము నాయకత్వంలో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.
జనసేన ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ మాట్లాడుతూ జనసేన అభ్యర్థులను గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తితో పని చేసి విజయం సాధిస్తామని పేర్కొన్నారు.
చివరగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ప్రజలిచ్చిన ఈ తీర్పుతో బాధ్యత మరింత పెరిగిందని, కార్యకర్తల కష్టానికి, ప్రజల నమ్మకానికి అభివృద్ధితో రుణం తీర్చుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు వాసే మురళి, దానేటి సన్యాసిరావు, పోలవరపు వెంకట్రావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, జనసేన నేత సందు పవన్, ఎంపీటీసీలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
