విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో డబ్బు, అంగబలం, ఆస్తిపాస్తులే ప్రామాణికంగా సాగే ఎన్నికల సంస్కృతిని సమూలంగా మార్చివేస్తూ.. జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సరికొత్త విప్లవానికి నాంది పలికారు. “రాజకీయం అంటే కోట్ల రూపాయల వ్యాపారం కాదు.. అది సామాన్యుడి గొంతుక” అని ఆయన గతంలో చెప్పిన ప్రతి మాటనూ ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో చేతల్లో రుజువు చేసి చూపించారు. జనసేన తరఫున గెలుపొందిన కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లలో అత్యధికులు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచే రావడం గమనార్హం.
ఈ సందర్భంగా కేఆర్ స్టేట్ టీమ్ సభ్యులు, ప్రముఖ టాక్స్ కన్సల్టెంట్ పాలంకి రామారావు గారు ప్రత్యేక విశ్లేషణను పంచుకున్నారు. రాజకీయాలంటే సంపన్నుల గుత్తాధిపత్యం మాత్రమే అన్న అహంకారపూరిత ఆలోచనలను బద్దలు కొడుతూ, నిస్వార్థంగా సమాజ సేవ చేసే సామాన్యులను చట్టసభలు, స్థానిక సంస్థల మెట్లెక్కించడమే ధ్యేయంగా పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేశారని ఆయన కొనియాడారు. రబ్బరు చెప్పులేసుకుని తిరిగే సామాన్య కార్యకర్తలను, కష్టపడే మనస్తత్వం ఉన్న మిడిల్ క్లాస్ యువతను గుర్తించి వారికి టికెట్లు కేటాయించి, అండగా నిలిచి గెలిపించుకున్న తీరు దేశ రాజకీయాలకే ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
కోట్లాది రూపాయలు కుమ్మరిస్తే తప్ప గెలవలేమన్న వ్యవస్థను కూల్చివేసి.. నీతి, నిజాయితీ, సేవా దృక్పథమే గెలుపుకు మూలస్తంభాలని పవన్ కళ్యాణ్ గారు చాటిచెప్పారు. ప్రజాస్వామ్యంలో అధికారం సామాన్యుడి చేతికి చేరినప్పుడే అసలైన గ్రామీణ, పట్టణ స్వరాజ్యం సాధ్యమవుతుందని ఈ ఫలితాలు నిరూపించాయి. నిజమైన ప్రజా నాయకుడిగా సామాన్యుడి ఆత్మగౌరవాన్ని గెలిపించిన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పాలంకి రామారావు గారు హర్షం వ్యక్తం చేశారు.
