తాడిగడప మున్సిపాలిటీలో రాజుకున్న ఎన్నికల వేడి: బీసీ జనరల్‌కు చైర్మన్ పీఠం.. 48 వార్డుల వారీగా రిజర్వేషన్ల పూర్తి జాబితా ఇదే.. 1.38 లక్షల మంది ఓటర్లు, 144 పోలింగ్ కేంద్రాలు! (జన గళం ఎలక్షన్ డెస్క్)
తాడిగడప/విజయవాడ: కృష్ణా జిల్లా తాడిగడప మున్సిపాలిటీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి ఒక్కసారిగా వేడెక్కింది. రాబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మొత్తం 48 వార్డులకు సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ స్పష్టమైంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన తాడిగడప మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీసీ జనరల్ (BC-G) కేటగిరీకి కేటాయించడంతో, ఆ వర్గ ఆశావహుల్లో రాజకీయ సమీకరణాలు ఊపందుకున్నాయి.
• 1,38,576 మంది ఓటర్లు.. మహిళలదే పైచేయి:
తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 1,38,576 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుష ఓటర్లు 67,575 మంది ఉండగా, మహిళా ఓటర్లు ఏకంగా 71,000 మంది ఉండటం విశేషం. ఇతరులు ఒకరు ఉన్నారు. ఓటర్ల సౌకర్యార్థం 48 వార్డుల పరిధిలో మొత్తం 144 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేయనున్నారు.
• 48 వార్డుల వారీగా రిజర్వేషన్ల పూర్తి వివరాలు:
– ఎస్టీ జనరల్ (ST-G – 1 వార్డు): 22
– ఎస్సీ మహిళలు (SC-W – 2 వార్డులు): 13, 32
– ఎస్సీ జనరల్ (SC-G – 3 వార్డులు): 3, 4, 45
– బీసీ మహిళలు (BC-W – 9 వార్డులు): 16, 17, 18, 19, 26, 27, 28, 29, 46
– బీసీ జనరల్ (BC-G – 9 వార్డులు): 20, 21, 31, 35, 36, 37, 38, 39, 48
– జనరల్ మహిళలు (General-W – 13 వార్డులు): 1, 5, 6, 7, 9, 10, 12, 15, 23, 30, 42, 43, 47
– అన్‌రిజర్వుడ్ (Unreserved – 11 వార్డులు): 2, 8, 11, 14, 24, 25, 33, 34, 40, 41, 44
వార్డుల రిజర్వేషన్లపై స్పష్టత రావడంతో ప్రధాన రాజకీయ పార్టీలైన జనసేన, టీడీపీ, వైఎస్సార్సీపీ ఆశావహులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ముఖ్యంగా చైర్మన్ పదవి బీసీ జనరల్‌కు దక్కడంతో ఆయా వార్డుల నుంచి బరిలోకి దిగేందుకు సీనియర్ నేతలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు.
