శ్రీకాళహస్తి ఆలయంలో అగ్నిప్రమాదం.. భక్తుల్లో తీవ్ర కలకలం: అన్నప్రసాద పోటులో పేలిన గ్యాస్ సిలిండర్.. ఒక్కసారిగా ఎగసిపడిన మంటలు.. రంగంలోకి దిగి మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది! (జన గళం బ్రేకింగ్ డెస్క్)
శ్రీకాళహస్తి/తిరుపతి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయ ప్రాంగణంలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఆలయంలోని అన్నప్రసాద తయారీ కేంద్రం (అన్నప్రసాద పోటు)లో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ఆలయ సిబ్బంది, భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
అన్నప్రసాద పోటులో వంట పనులు జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ గ్యాస్ సిలిండర్ పేలినట్లు సమాచారం. దీంతో పోటులో ఒక్కసారిగా దట్టమైన పొగతో పాటు మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే ఆలయ అధికారులు, భద్రతా సిబ్బంది అప్రమత్తమై భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఆస్తి నష్టం లేదా సిబ్బంది క్షేమ సమాచారంపై అధికారులు ఆరా తీస్తున్నారు.
