కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో వినాయక చవితి పండుగను భక్తులు ప్రశాంతంగా చేసుకోలేని దుస్థితి దాపురించిందని, చివరికి విగ్రహాల నిమజ్జనానికి కూడా కాలువల్లో నీరు లేక భక్తులు రోడ్డున పడ్డారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ ప్రయోజనాల కోసం కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీవ్రమైన అసత్య ప్రచారం చేశారని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని సిట్ దర్యాప్తులో జంతువుల కొవ్వు కలవలేదని తేలడంతో వీరి అబద్ధాలు బట్టబయలయ్యాయని ధ్వజమెత్తారు. హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసినందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తిరుమలకు కాలినడకన వెళ్లి ప్రాయశ్చిత్తం చేసుకుని భక్తులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
వినాయక నిమజ్జనాలకు నీళ్లివ్వని అసమర్థ ప్రభుత్వం: తిరుమల లడ్డూపై అబద్ధాలు బట్టబయలయ్యాయన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
