జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: అనంతపురం నగరంలో మహిళలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించే దిశగా అనంతపురం-హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (అహుడా) కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో ‘పింక్ టాయిలెట్లు’ (Pink Toilets) నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియను ప్రారంభించేందుకు అహుడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అహుడా కార్యాలయంలో చైర్మన్ శ్రీ టి.సి.వరుణ్ గారు మరియు వైస్ చైర్పర్సన్, జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణు చరణ్ తేజ్ గారి అధ్యక్షతన పలు అభివృద్ధి అంశాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నగర సమగ్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సమావేశంలో అహుడా పరిధిలో కొనసాగుతున్న మరియు ప్రణాళికాబద్ధంగా చేపట్టాల్సిన వివిధ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. ముఖ్యంగా నగరంలో నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్న అనాథరైజ్డ్ (అనధికారిక) లేఅవుట్లపై ఉక్కుపాదం మోపాలని, వాటిపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను చైర్మన్ ఆదేశించారు. అలాగే, వచ్చే వారంలో కోడూరు లేఅవుట్‌కు అధికారికంగా శంకుస్థాపన చేయాలని సమావేశంలో నిర్ణయించారు. పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) మోడల్ కింద చేపడుతున్న ప్రాజెక్టుల పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
అంతకుముందు అహుడా కార్యాలయంలో నిర్వహించిన ప్రజా విజ్ఞితుల (గ్రీవెన్స్) కార్యక్రమంలో చైర్మన్ శ్రీ టి.సి.వరుణ్ గారు స్వయంగా పాల్గొని అర్జీదారుల నుంచి నేరుగా ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి, వాటిని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యతగా అహుడా యంత్రాంగం పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అహుడా కార్యాలయ అధికారులు మరియు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Slug: anantapur-ahuda-pink-toilets-review-meeting-tc-varun
