జన గళం ప్రత్యేక ప్రతినిధి, గుంటూరు:
రాష్ట్ర మాజీ మంత్రి, సీనియర్ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణను కాపు జేఏసీ మరియు రాధా రంగా మిత్ర మండలి నాయకులు గుంటూరులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు. ఇటీవల ఆయన భుజానికి శస్త్రచికిత్స జరగడంతో ప్రస్తుతం స్వగృహంలో వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చందు జనార్దన్, రాధా రంగా మిత్ర మండలి సీనియర్ నేత సుంకర సాంబశివరావు, జేఏసీ నాయకులు మిరియాల శ్రీనివాసరావుతో పాటు ప్రముఖ వైద్య నిపుణులు సాయి కృష్ణ పాల్గొన్నారు. కన్నా లక్ష్మీనారాయణ ఆరోగ్య క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్న నాయకులు, ఆయన శస్త్రచికిత్స నుంచి వేగంగా కోలుకుంటుండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ప్రజా నాయకుడిగా సుదీర్ఘ అనుభవం కలిగిన కన్నా లక్ష్మీనారాయణ ఆయురారోగ్యాలతో త్వరలోనే సంపూర్ణ స్వస్థత పొందాలని వారు ఆకాంక్షించారు. తనను ఆత్మీయంగా కలిసి పరామర్శించినందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ కన్నా లక్ష్మీనారాయణ ధన్యవాదాలు తెలియజేశారు.
