మట్టి గణపతిని పూజిద్దాం.. భావితరాలను కాపాడుదాం: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
- పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక ప్రతిమలనే పూజించాలి
- అవనిగడ్డ నియోజకవర్గ, రాష్ట్ర ప్రజలకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ వినాయక చవితి శుభాకాంక్షలు
అవనిగడ్డ:
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని అవనిగడ్డ శాసనసభ్యులు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజానీకానికి హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. “మట్టి గణపతిని పూజిద్దాం.. భావితరాల భవిష్యత్తును కాపాడుదాం” అని పిలుపునిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ), ప్రమాదకర రసాయన రంగులతో కూడిన విగ్రహాల వల్ల జలవనరులు, జీవావరణం తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మట్టితో చేసిన గణపతి విగ్రహాలను పూజించడమే సమాజానికి శ్రేయస్కరమని పేర్కొన్నారు.
ఆ విఘ్ననాయకుని దివ్య ఆశీస్సులతో ప్రజలందరి జీవితాల్లోని ఆటంకాలు తొలగిపోయి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, విజయాలు వెల్లివిరియాలని గణనాథుడిని వేడుకుంటున్నట్లు తెలిపారు. పవిత్రమైన వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, పర్యావరణ హితంగా, ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు
