చైనాలోని ఒక ప్రముఖ పోర్టులో మరమ్మతుల నిమిత్తం నిలిపి ఉంచిన కార్గో నౌకలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాలంలో కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు ఆచూకీ గల్లంతైనట్లు చైనా అధికారిక మీడియా గురువారం వెల్లడించింది.
ఈశా చైనా తీర ప్రాంతంలోని ప్రధాన షిప్పింగ్ హబ్‌గా ఉన్న కింగ్డావో పోర్టులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ ఉన్న బెహై షిప్‌బిల్డింగ్ కంపెనీకి చెందిన డాక్లో ఈ నౌకకు మరమ్మతులు జరుగుతున్నాయి. జిన్హువా వార్తా సంస్థ విడుదల చేసిన ఫోటో ఆధారంగా ఈ నౌకను ‘ఓషన్ మెలోడీ’గా గుర్తించారు. వెస్సెల్ఫైండర్ ట్రాకింగ్ వెబ్సైట్ సమాచారం ప్రకారం, ఈ నౌక లైబీరియా దేశ జెండాతో ప్రయాణిస్తుంది.
ప్రమాదం జరిగిన సమయంలో నౌకలో మొత్తం 42 మంది వ్యక్తులు ఉన్నట్లు జిన్హువా నివేదించింది. వీరిలో 12 మందిని ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మరో ఐదుగురు గాయపడగా, వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
గురువారం ఉదయం సుమారు 11 గంటల ప్రాంతంలో ఈ నౌకలో మంటలు చెలరేగాయి. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటల కల్లా అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. నౌకపై ఉన్న కార్మికులు మంటలనుార్పడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి.
ఈ దుర్ఘటనపై చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గల్లై్లయిన వారి కోసం ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాలని ఆయన అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రమాదంలో చిక్కుకున్న వారిని తక్షణమే రక్షించాలని దేశ ప్రధాని లీ కియాంగ్ పిలుపునిచ్చారు.
భవిష్యత్తులో ఇలాంటి పెను ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన నివారణ చర్యలను పక్కాగా అమలు చేయాలని జి జిన్‌పింగ్ స్పష్టం చేశారు. ప్రాణనష్టాన్ని నివారించేందుకు కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ప్రమాదం జరిగిన బెహై షిప్‌బిల్డింగ్ సంస్థ.. ప్రపంచంలోనే అతిపెద్ద నౌకా నిర్మాణ సంస్థ అయిన ప్రభుత్వ స్వామ్యంలోని చైనా స్టేట్ షిప్‌బిల్డింగ్ కార్పొరేషన్లో భాగం. ఈ సంస్థ వెబ్సైట్ ప్రకారం దీని ప్రధాన వ్యాపారం నౌకల నిర్మాణం మరియు వాటికి మరమ్మతులు చేయడం.
