జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ప్రజలను తీవ్ర ఇబ్బంది పెడుతున్న దీర్ఘకాలిక రహదారి సమస్యకు ఎట్టకేలకు శాశ్వత పరిష్కారం లభించింది. బాపులపాడు మండలం ఆరుగొలను గ్రామంలోని జాతీయ రహదారి (NH 216 H) మచిలీపట్నం-నూజివీడు-కల్లూరు (MNK) రోడ్డు వద్ద ఉన్న సమస్యపై ఏపీ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, గన్నవరం నియోజకవర్గ జనసేన నాయకులు గరికిపాటి శివశంకర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గ్రామంలోని స్వర్గీయ శ్రీ వంగవీటి మోహనరంగా విగ్రహం సమీపంలో నిత్యం పెద్ద పెద్ద గుంటలు ఏర్పడి వాహనదారులు, ప్రయాణికులు పడుతున్న తీవ్ర ఇబ్బట్ల గురించి స్థానికులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.
ప్రజల నుంచి అందిన సమాచారంపై తక్షణమే స్పందించిన గరికిపాటి శివశంకర్ వెంటనే ఆ ప్రాంతాన్ని పరిశీలించి క్షేత్రస్థాయి పరిస్థితిని స్వయంగా అంచనా వేశారు. అనంతరం సంబంధిత నేషనల్ హైవేస్ అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడి, అక్కడ తరచూ గుంటలు ఏర్పడటానికి కారణాలను విశ్లేషించారు. ఈ సమస్యకు కేవలం తాత్కాలిక మరమత్తులతో సరిపెట్టకుండా పటిష్టమైన రీతిలో శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఆయన సమన్వయంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఆ ప్రాంతంలో శాశ్వత ప్రాతిపదికన రోడ్డు అభివృద్ధి పనులను చేపట్టి సమస్యను నివారించారు.
దీర్ఘకాలంగా వేధిస్తున్న రహదారి సమస్యను ఉన్నతాధికారులతో మాట్లాడి సత్వరమే పరిష్కరించిన గరికిపాటి శివశంకర్ చొరవను ఆరుగొలను గ్రామస్థులు, వాహనదారులు కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వ ప్రతినిధులు నిరంతరం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారనడానికి ఈ ఘటనే నిదర్శనమని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు, ప్రయాణికులకు సురక్షితమైన రహదారులను అందించేందుకు భవిష్యత్తులోనూ తమ వంతు కృషి కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.
Slug: garikapati-shiva-shankar-arugolanu-road-solution-gannavaram
