జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఫోటోగ్రఫీ రంగంలో ఏలూరు జిల్లా నూజివీడు ప్రాంతానికి చెందిన యువకుడు జాతీయ స్థాయిలో మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు. కళా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అందించే ‘భారత్ కళా పురస్కార్–2026’ అవార్డును నూజివీడుకు చెందిన ప్రముఖ క్యాండిడ్ ఫోటోగ్రాఫర్ దిలీప్ కుమార్ సొంతం చేసుకున్నారు. ఈ పురస్కారాన్ని ఆయన వరుసగా రెండో ఏడాది అందుకోవడం విశేషం. దీంతో క్యాండిడ్ ఫోటోగ్రఫీ రంగంలో ఆయనకు లభిస్తున్న జాతీయ స్థాయి గుర్తింపు మరోసారి స్పష్టమైంది.
ఫోటోగ్రఫీ అండ్ మీడియా కమ్యూనికేషన్లో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (ఎంఎఫ్ఏ) పూర్తి చేసిన దిలీప్ కుమార్, అనంతంరం దేశ రాజధాని ఢిల్లీ మరియు ముంబై నగరాల్లోని ప్రముఖ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్లతో కలిసి పనిచేశారు. మ్యాగజైన్లు, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు, యాడ్ ఏజెన్సీలతో కలిసి అనుభవం గడించిన ఆయన, ప్రస్తుతం హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని ‘ఫ్యాబ్ వెడ్డింగ్ స్టోరీస్’ ద్వారా ప్రీమియం వెడ్డింగ్ ఈవెంట్లకు సేవలు అందిస్తున్నారు. వివాహ వేడుకల్లో సహజంగా చోటుచేసుకునే భావోద్వేగాలను, అపురూపమైన ఆనంద క్షణాలను ఎలాంటి కృత్రిమత లేకుండా అత్యద్భుతంగా క్యాప్చర్ చేయడంలో ఆయన ప్రత్యేక శైలిని కనబరుస్తున్నారు.
తాను ఫోటోగ్రఫీ రంగంలో సంపాదించిన అనుభవం, అత్యాధునిక నైపుణ్యాలను తన స్వస్థలమైన నూజివీడుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకురావడమే తన లక్ష్యమని దిలీప్ కుమార్ తెలిపారు. కైకలూరు, గుడివాడ, తిరువూరు, మైలవరం తదితర ప్రాంతాల్లో జరిగే వివాహ వేడుకలు, ప్రత్యేక కార్యక్రమాలకు అత్యుత్తమ నాణ్యతతో కూడిన ఫోటోగ్రఫీ సేవలు అందిస్తానని పేర్కొన్నారు. వరుసగా రెండో ఏడాది జాతీయ పురస్కారం అందుకున్న దిలీప్ కుమార్‌ను నూజివీడు ప్రాంత వాసులు, ఫోటోగ్రాఫర్లు మరియు శ్రేయోభిలాషులు ఘనంగా అభినందించారు.
Slug: nuzvid-photographer-dileep-kumar-bharat-kala-puraskar-2026
