జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో మాలమహానాడు ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్ సంచలన విషయాలు వెల్లడించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన వికాస్ స్కూల్ మరియు జూనియర్ కాలేజ్ యాజమాన్యం మోసపూరిత వైఖరి, పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే బస్సు యజమానులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, స్పందించకపోతే అక్టోబర్ 12న రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
వివాదం నేపథ్యం వివరాల్లోకి వెళితే.. జంగారెడ్డిగూడెంలోని వికాస్ జూనియర్ కాలేజ్ విద్యార్థుల రవాణా కోసం విప్పర్తి సుదర్శన్ (ఎస్సీ-మాల), పెదపట్నం పరమేష్ (బీసీ-నాయి బ్రాహ్మణ), గుబ్బల పెద్దిరాజు (బీసీ-శెట్టిబలిజ) తదితరులకు చెందిన 5 బస్సులను లీజుకు తీసుకున్నారు. అయితే లీజు మొత్తం చెల్లించకపోగా, ఆ బస్సులను యాజమాన్యానికి చెందిన కాకర్ల రామకృష్ణ చౌదరి (పెదబాబు), విష్ణు, గణేష్, జగన్ లు అమ్ముకున్నారు. సుమారు రెండు సంవత్సరాలుగా డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తుండటంతో, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్ సమక్షంలో ఐదు బస్సులకు గాను రూ. 39 లక్షల నష్టపరిహారం చెల్లిస్తామని వికాస్ యాజమాన్యం తరఫున విష్ణు అంగీకరించారు. ఆ తర్వాత నుంచి మాట తప్పి, పెద్దలతో కాలయాపన చేస్తుండటంతో బాధితులు జంగారెడ్డిగూడెం పోలీసులను ఆశ్రయించారు.
సుమారు నెల రోజుల క్రితం జంగారెడ్డిగూడెం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా, పోలీసులు కనీసం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోగా వికాస్ కాలేజ్ యాజమాన్యానికి కొమ్ముకాసేలా వ్యవహరించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి విసిగిపోయిన బాధితులు విప్పర్తి సుదర్శన్, పెదపట్నం పరమేష్ తీవ్ర మనస్తాపానికి గురై ఈ నెల 5వ తేదీన కారులో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన డ్రైవర్ వెంటనే వారిని తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.
బాధితుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వికాస్ కాలేజ్ యాజమాన్యంపై మరియు బాధ్యత విస్మరించిన పోలీసు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాలమహానాడు డిమాండ్ చేసింది. ఈ ఘటనపై డీజీపీ, డీఐజీ, ఎస్సీ/ఎస్టీ కమిషన్, లోకాయుక్తను ఆశ్రయించనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 12 నాటికి బాధితులకు న్యాయం జరగకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడతామని నల్లి రాజేష్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు గుండె నగేష్, పలువురు నాయకులు, బాధితుల బంధువులు పాల్గొన్నారు.
Slug: palakollu-west-godavari-mala-mahanadu-nalli-rajesh-vikas-college-bus-issue-suicide-attempt
