జన గళం విజయవాడ తూర్పు/విజయవాడ పార్లమెంట్ బ్యూరో: జనసేన పార్టీ సిద్ధాంతాలను నమ్ముకుని నిరంతరం కష్టపడుతున్న జనసైనికులు, వీర మహిళలు మరియు చిరు వ్యాపారస్తుల కుటుంబాల్లో వెలుగులు నింపే దిశగా చేపట్టిన స్వయం ఉపాధి పరికరాల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఆటోలు, కుట్టు మిషన్లు, తోపుడు బండ్లు మరియు టిఫిన్ బండ్ల పంపిణీ కార్యక్రమం దిగ్విజయం కావడంపై జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ తూర్పు నియోజకవర్గం మరియు విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక ధన్యవాద సందేశాన్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ.. కష్టపడే ప్రతి కార్యకర్తకు అండగా నిలవడం, ఉపాధి కోరుకునే ప్రతి కుటుంబానికి భరోసా కల్పించడం మరియు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ప్రతి ఒక్కరికీ ప్రోత్సాహాన్ని అందించడమే తమ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా నిర్వహించిన ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు మరియు శ్రేయోభిలాషులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశీస్సులు, ప్రోత్సాహమే తమకు అసలైన బలమని పేర్కొన్నారు.
