జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ అయినప్పటికీ, పలు కారణాలతో అక్టోబర్ 2026 నాటి సాధారణ ఎన్నికల్లో కొన్ని పట్టణ స్థానిక సంస్థలకు (యూఎల్బీ) ఎన్నికలు నిర్వహించడం లేదని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. పాలకవర్గాల పదవీకాలం ముగియకపోవడం, కోర్టు వివాదాలు, విలీనాలు వంటి కారణాల దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 23 పట్టణ స్థానిక సంస్థలను ప్రస్తుత షెడ్యూల్ నుంచి మినహాయించారు.
ఈ జాబితాలో శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, కాకినాడ, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లతో పాటు గుడివాడ, భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, నరసరావుపేట, బాపట్ల, పొన్నూరు, కావలి, గూడూరు, శ్రీకాళహస్తి, కందుకూరు వంటి ప్రధాన మున్సిపాలిటీలు ఉన్నాయి. అలాగే వైఎస్సార్ తాడిగడప, చింతలపూడి, పొదిలి, అల్లూరు, బి.కొత్తకోట వంటి నగర పంచాయతీలు కూడా ఉన్నాయి. ఈ 23 పట్టణ స్థానిక సంస్థలకు ప్రస్తుత విడతలో కాకుండా వాటి పదవీకాలం పూర్తయిన తర్వాత ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహించనున్నారు.
