జన గళం అవనిగడ్డ బ్యూరో: తెలుగుదేశం పార్టీ కోసం క్షేత్రస్థాయిలో చెమటోడ్చే ప్రతి కార్యకర్తకు కంటికి రెప్పలా అండగా ఉంటానని టీడీపీ అవనిగడ్డ నియోజకవర్గ ఇన్‌చార్జ్ విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం అవనిగడ్డ 1వ వార్డులోని టీడీపీ నియోజకవర్గ కార్యాలయం వద్ద మండల పార్టీ అధ్యక్షులు యాసం చిట్టిబాబు అధ్యక్షతన విస్తృతస్థాయి సమన్వయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి విక్కుర్తి శ్రీనివాసరావుతో పాటు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత పార్టీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి నేతలు ప్రసంగించారు.
ఈ సందర్భంగా విక్కుర్తి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు విజనరీ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తోందని, నిబద్ధతతో పనిచేసే వ్యక్తిత్వం ఆయన సొంతమని కొనియాడారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త సేవలను గుర్తిస్తానని, ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ వెన్నంటి ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రత్యర్థులు కావాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు. నియోజకవర్గంలో దీర్ఘకాలిక సమస్యలుగా ఉన్న ఎదురుమొండి బ్రిడ్జి, ఔట్‌ఫాల్ సూయిజ్ ప్రాజెక్టుల శాశ్వత పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం కనపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అవనిగడ్డ పచ్చజెండాకు కంచుకోట అని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఒక్క సీటు కూడా కోల్పోకుండా క్లీన్‌స్వీప్ చేయాలని పిలుపునిచ్చారు. ఫేక్ ఐడీలతో కూటమి ఐక్యతను దెబ్బతీయాలని చూస్తున్న వైఎస్సార్సీపీ కుట్రలను తిప్పికొట్టాలన్నారు. ఇదే వేదికపై వైఎస్సార్సీపీ ఇన్‌చార్జ్ సింహాద్రి రమేష్ ఆరోపణలను నేతలు తీవ్రంగా ఖండిస్తూనే, స్థానిక కూటమి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తీరుపై కొందరు ముఖ్యనేతలు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
