జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించి సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు మంగళవారం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం మండల తహసీల్దార్ జో బాబుకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా రైతులు, రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ బంటుమిల్లి మండలం తీరప్రాంత పరిధిలో ఉండటం వల్ల ఇక్కడి భూముల్లో చౌడు తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపారు. ఈ నేలల స్వభావం దృష్ట్యా వరి పంట మినహా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అధికారులు ఇతర పంటలు వేసుకోవాలని సూచిస్తున్నప్పటికీ, సాగునీటి కొరత మరియు భూగర్భ చౌడు సమస్యల వల్ల అది ఆచరణ సాధ్యం కాదన్నారు. తీవ్ర వర్షాభావం, పంట నష్టాలతో అల్లాడుతున్న వేళ కౌలు రైతులపై పంటల బీమా ప్రీమియం చెల్లింపుల భారం మోపడం అన్యాయమని మండిపడ్డారు.
బడా కార్పొరేట్ సంస్థలకు వేల కోట్ల రూపాయల రాయితీలు కల్పిస్తున్న పాలకులు, దేశానికి అన్నంపెట్టే అన్నదాతలను విస్మరించడం శోచనీయమని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బంటుమిల్లి మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని, ఎకరాకు నష్టపరిహారంగా లేదా బాధిత ప్రతి రైతుకు తక్షణమే రూ. 25 వేల చొప్పున ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
