జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: విజయవాడలోని క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) కార్యాలయం వద్ద ఉపాధ్యాయులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సాగించిన దాడి వెనుక ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పక్కా కుట్ర ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్, విష్ణు వంటి మాజీ ప్రజాప్రతినిధులు, రౌడీలు కలిసి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు గేట్లు మూసి తాళాలు వేయకపోతే ఆ రోజు ఉపాధ్యాయులను దారుణంగా చంపేసేవారని ఆందోళన వ్యక్తం చేశారు.
గతంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన వారిలో 51 మంది నిన్న శాప్ వద్ద ఉపాధ్యాయులపై దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారని వెల్లడించారు. రాష్ట్రంలో తీవ్ర అలజడి సృష్టించాలని తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్ ఆదేశాలు ఇస్తుంటే, ఆయన అనుచరులు దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. స్వయంగా రౌడీలతో దాడులు చేయించి, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని గవర్నర్‌ను కలుస్తారని, గవర్నర్‌కు కూడా అబద్ధాలు చెబుతారా అని నిలదీశారు. దాడి చేసిన రౌడీలందరినీ తాడేపల్లి ప్యాలెస్‌లో ఉంచి కాపాడుతున్నారని, ఈ మొత్తం కుట్రలో జగన్మోహన్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్వయంగా తానే డీజీపీని కలిసి జగన్‌పై అధికారికంగా ఫిర్యాదు చేస్తానని, ఆయనను అరెస్ట్ చేసేవరకు న్యాయపోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
Slug: budda-venkanna-demands-arrest-of-ys-jagan-sap-office-attack-vijayawada-press-meet
