జన గళం మచిలీపట్నం బ్యూరో: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తొలి అభ్యర్థి ఎంపికపై జనసేన పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్ కుమార్ రెడ్డిని ఖరారు చేయడంపై జనసేన పార్టీ మచిలీపట్నం మండల పార్టీ అధ్యక్షులు, పేదాయాదర మాజీ సర్పంచ్ శ్రీ గల్లా తిమోతి సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ దూకుడు అంటూ ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమని, తొలి అభ్యర్థిగా మళ్లీ ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు.
పార్టీలో దళితులు, బీసీలు, ఎస్టీలు లేరా అని ప్రశ్నించిన ఆయన.. ఓసీల్లో వేరే సామాజిక వర్గాలకు చెందిన వారు లేదా పార్టీ కోసం నిలబడ్డ కాపు నాయకులు ఎవరూ జగన్ మోహన్ రెడ్డికి కనిపించలేదా అని సూటిగా ప్రశ్నించారు. పేర్ని నాని వంటి వారిని కేవలం రాజకీయ అవసరాలకు వాడుకుంటూ, కీలక పదవులు వచ్చేసరికి పక్కన పెడుతున్నారని ఎద్దేవా చేశారు. జనసేనను కాపుల పార్టీ అంటూ తప్పుడు ముద్ర వేసే వైఎస్సార్సీపీ నేతలు.. ఇప్పుడు తమ నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాల వారికి సమన్యాయం చేయడంలో విఫలమైన వైఎస్సార్సీపీకి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
