జన గళం అరకు/పార్వతీపురం డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో అరకు పార్లమెంట్ పరిధిలోని పురపాలక సంఘాల్లో జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీ) శ్రీ కొణిదెల నాగబాబు గారు ప్రదర్శించిన వ్యూహాత్మక పటిమ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సాలూరు మరియు పార్వతీపురం మున్సిపాలిటీల్లో మిత్రపక్షంతో జరిగిన సీట్ల సర్దుబాటు చర్చల్లో ఏమాత్రం వెనుకడుగు వేయకుండా, పార్టీ కేడర్ మనోభావాలను కాపాడుతూ ఆయన తీసుకున్న నిర్ణయాలు క్షేత్రస్థాయి జనసైనికుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి.
సాలూరు మున్సిపాలిటీ పరిధిలో ఎన్డీయే కూటమి ఒప్పందంలో భాగంగా మున్సిపల్ చైర్మన్ పదవి జనసేన పార్టీకి దక్కినప్పటికీ, వార్డుల పంపకాల వద్ద తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడింది. మొత్తం 32 వార్డులున్న సాలూరులో స్థానిక శాసనసభ్యురాలు, రాష్ట్ర మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు తొలుత జనసేనకు కేవలం 4 లేదా 5 వార్డులు మాత్రమే కేటాయించేందుకు మొగ్గు చూపారు. అయితే, కూటమిలో జనసేనకు దక్కాల్సిన న్యాయబద్ధమైన 30 శాతం వాటా కింద కనీసం 10 వార్డులను కేటాయించాలని నాగబాబు గారు గట్టిగా పట్టుబట్టారు. సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం చివరకు 9 వార్డుల్లో జనసేన అభ్యర్థులకు మద్దతు ఇచ్చేలా ఇరు పక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. దీనికి కొనసాగింపుగా రెండు పార్టీల్లోని రెబల్ అభ్యర్థులను ఉపసంహరింపజేసేలా పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది.
మరోవైపు పార్వతీపురం మున్సిపాలిటీలో మరింత రసవత్తర పరిణామాలు చోటుచేసుకున్నాయి. మొత్తం 36 వార్డులున్న ఈ పురపాలక సంఘంలో జనసేన పార్టీ గణనీయమైన బలం కలిగి ఉన్న 12 వార్డులను కోరింది. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే శ్రీ బి. విజయచంద్ర గారు తొలుత కేవలం 4 వార్డులకే పరిమితం చేయాలని చూసినప్పటికీ, చర్చల అనంతరం 8 వార్డులతో పాటు వైస్ చైర్మన్ పదవి ఇచ్చేందుకు టీడీపీ సూత్రప్రాయంగా అంగీకరించింది. అయితే, అనూహ్యంగా ఆ హామీ నుంచి వెనక్కి తగ్గిన ఎమ్మెల్యే విజయచంద్ర గారు 36 వార్డులకు గాను ఏకపక్షంగా 34 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులకే బీ-ఫారాలు అందజేశారు.
ఈ పరిణామంతో ఏమాత్రం ఆత్మస్థైర్యం కోల్పోని నాగబాబు గారు.. జనసైనికుల గౌరవానికి భంగం కలగకుండా తక్షణమే పార్టీ బలంగా ఉన్న 12 వార్డుల్లో జనసేన అభ్యర్థులకు అధికారిక బీ-ఫారాలు అందజేశారు. అదే సమయంలో కూటమి మిత్రధర్మాన్ని గౌరవిస్తూ, జనసేన తరఫున వేసిన మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని శ్రీమతి దీప్తి గారి నామినేషన్‌ను ఉపసంహరించుకోవడమే కాకుండా.. టీడీపీ చైర్మన్ అభ్యర్థి గెలుపునకు, మిగిలిన 24 వార్డుల్లో టీడీపీ అభ్యర్థుల విజయానికి జనసేన శ్రేణులు సంపూర్ణ సహకారం అందిస్తాయని హుందాగా ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోనే తొలిసారిగా పార్వతీపురంలో 12 వార్డుల్లో జనసేన-టీడీపీ మధ్య ‘స్నేహపూర్వక పోటీ’ (ఫ్రెండ్లీ కంటెస్ట్) ఏర్పడింది. ఎక్కడా తగ్గకుండా పార్టీ జెండాను, జనసైనికుల మనోభావాలను నిలబెట్టిన నాగబాబు గారి నాయకత్వానికి ఉత్తరాంధ్ర కేడర్ నీరాజనాలు పలుకుతోంది.
