జన గళం విజయవాడ బ్యూరో: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సుదీర్ఘ ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని, ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కాంక్షిస్తూ విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల సన్నిధిలో విశేష పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు బుధవారం తెల్లవారుజామున రాజ్యసభ సభ్యులు శ్రీ లింగమనేని రమేష్ దుర్గమ్మ ఆలయంలో ప్రధాని పేరిట శాస్త్రోక్తంగా ప్రత్యేక ‘ఖడ్గమాల అర్చన’ జరిపించారు.
ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ప్రధాని నరేంద్ర మోదీ గోత్రనామాలతో సంకల్పం చేయించి అమ్మవారి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధించాలని, కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, పోలవరం జాతీయ ప్రాజెక్ట్, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి కావాలని ఎంపీ లింగమనేని రమేష్ అమ్మవారిని వేడుకున్నారు. అనంతరం వేద ఆశీర్వచనం స్వీకరించిన ఎంపీ, అమ్మవారి పవిత్ర శేషవస్త్రాలు, తీర్థ ప్రసాదాలు మరియు దివ్య చిత్రపటాన్ని ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయానికి (PMO) ప్రత్యేకంగా పంపించారు.
