జన గళం కృత్తివెన్ను/పెడన బ్యూరో: సముద్రం, ఏటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించి సమాజంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చిన్నగొల్లపాలెం పంచాయతీ పరిధిలోని ఏటిపోరు గ్రామంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, అర్హులైన 70 మంది మత్స్యకారులకు అధికారికంగా బోట్ లైసెన్స్ పత్రాలను స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం, భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. వేటకు వెళ్లే సమయంలో మత్స్యకారులకు ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకే ఈ లైసెన్సులను జారీ చేసినట్లు వెల్లడించారు. మత్స్యకారులు ప్రమాదకరమైన పరిస్థితుల్లో జీవనోపాధి పొందుతున్నారని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు, సంక్షేమ పథకాలను అందిస్తోందని స్పష్టం చేశారు. లైసెన్సులు అందుకున్న మత్స్యకారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మత్స్యశాఖ అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
