జన గళం పెడన/కృతివెన్ను బ్యూరో: కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం, కృతివెన్ను మండలం చెరుకుమిల్లి గ్రామ ప్రజల దశాబ్దన్నర కాలపు కల ఎట్టకేలకు సాకారం కానుంది. గత పదిహేనేళ్లుగా తీవ్రంగా ధ్వంసమై రాకపోకలకు వీల్లేకుండా మారిన ప్రధాన రహదారి నిర్మాణానికి సాస్కి (SASKI) నిధులు మంజూరయ్యాయి. స్థానిక శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ ప్రత్యేక చొరవతో మంజూరైన ఈ బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంగళవారం (06-10-2026) సాయంత్రం ఆయన స్వయంగా శంకుస్థాపన చేయనున్నారు.
గతంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ గ్రామానికి విచ్చేసిన సందర్భంలో గ్రామ కూటమి నాయకులు, పెద్దలు సమస్య తీవ్రతను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే, అధికారులతో మాట్లాడి ప్రత్యేక నిధులను మంజూరు చేయించారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం 5:00 గంటలకు పెందూరు అడ్డ రోడ్డు వద్ద ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభిస్తారు. తమ చిరకాల వాంఛను నెరవేర్చినందుకు గాను ఎమ్మెల్యేకు మరియు కూటమి నాయకులకు ఘనంగా స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపేందుకు గ్రామస్తులు, కూటమి కుటుంబ శ్రేణులు, పెద్దలు అధిక సంఖ్యలో తరలిరావాలని చెరుకుమిల్లి కూటమి నాయకత్వం పిలుపునిచ్చింది.
