జన గళం మచిలీపట్నం బ్యూరో: ఆంధ్రప్రదేశ్లోని 25 మంది లోక్సభ సభ్యుల పనితీరుపై ప్రముఖ రీసెర్చ్ సంస్థ రైజ్ (RISE) రూపొందించిన ‘ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ఎక్స్-రే 2026’ సర్వే నివేదికలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి అత్యుత్తమ పనితీరు కనబరిచి అగ్రశ్రేణి ర్యాంకింగ్స్లో స్థానం దక్కించుకున్నారు. ఎంపీల పనితీరు, నియోజకవర్గాల్లో మౌలిక వసతుల కల్పన, ఎంపీల్యాడ్స్ నిధుల వినియోగం, ప్రజా సమస్యల పరిష్కారంలో నిరంతర క్రియాశీలత ప్రాతిపదికన విడుదలైన ఈ జాబితాలో ఆయన రాష్ట్రవ్యాప్తంగా టాప్-5లో నిలిచి తన సమర్థతను చాటుకున్నారు.
మచిలీపట్నం పోర్టు పనుల వేగవంతం, తీరప్రాంత మౌలిక వసతుల విస్తరణ, గ్రామీణ తాగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం వంటి అనేక ప్రజా ప్రయోజన కార్యక్రమాలను ముందంజలో ఉంచిన ఎంపీ బాలశౌరికి ఈ ఘనత దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నిరంతరం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ కూటమి ప్రభుత్వ అభివృద్ధి ఎజెండాను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో ఆయన చూపుతున్న ప్రత్యేక చొరవే ఈ గుర్తింపునకు కారణమని స్థానిక నేతలు పేర్కొంటున్నారు. ఎంపీ బాలశౌరి ఉత్తమ ర్యాంక్ సాధించడం పట్ల బందరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కూటమి శ్రేణులు, మేధావులు, అభిమానులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
