రచన: జన గళం బిజినెస్ డెస్క్, హైదరాబాద్: వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో నవ శకానికి నాంది పలుకుతూ హైదరాబాద్‌లోని హైటెక్స్ (HITEX) వేదికగా అక్టోబర్ 14, 15 తేదీల్లో ప్రతిష్టాత్మక ‘సమాఖ్య 2026’ (SAMAKHYA 2026) సదస్సు ఘనంగా జరగనుంది. ఈ మహోత్సవానికి ఇంకా కేవలం 10 రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. అక్టోబర్ 14న తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ మహా సదస్సులో పాల్గొని ‘సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్’ (SCC)ను అధికారికంగా ప్రారంభించనున్నారు.
ఈ సదస్సులో జనరల్ బాడీ ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడే మేనేజింగ్ కమిటీ పర్యవేక్షణలో సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవిష్యత్ ప్రణాళికలు, రోడ్‌మ్యాప్ రూపుదిద్దుకోనున్నాయి. సమాఖ్య 2026 అనేది కేవలం రెండు రోజుల పాటు జరిగే సాధారణ కార్యక్రమం మాత్రమే కాదని, రాబోయే దశాబ్దాల పాటు వ్యాపార, వాణిజ్య రంగాల్లో అపార అవకాశాలను సృష్టించే బలమైన పునాది అని నిర్వాహకులు స్పష్టం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులు ఈ వేదికపై ఒకచోట చేరి నూతన ఆలోచనలు పంచుకోనున్నారు.
