రచన: జన గళం మచిలీపట్నం డెస్క్: మచిలీపట్నం నియోజకవర్గంలో దశాబ్దాలుగా రాజకీయాలను శాసిస్తున్న కుటుంబ వారసత్వ నాయకత్వాలు చేసిన అభివృద్ధిపై స్థానిక నాయకుడు కోన నాగార్జున ఘాటైన పోస్టర్‌తో సరికొత్త చర్చను లేవనెత్తారు. “మచిలీపట్నం అభివృద్ధి ఎక్కడ?” పేరిట విడుదల చేసిన ఈ వివరాల్లో, నియోజకవర్గాన్ని ఏలిన రెండు ప్రధాన కుటుంబాల ఎమ్మెల్యే పదవీకాలాల చిట్టాను లెక్కలతో సహా ప్రజల ముందుంచారు. గత ముప్పై ఏళ్లకు పైగా బందరును పాలించిన నేతలు చేసిన అభివృద్ధిని నిధులు, పనులు, ఫలితాల రూపంలో బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ పోస్టర్ లెక్కల ప్రకారం.. పేర్ని కుటుంబంలో మూడు తరాల రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే, దివంగత పేర్ని కృష్ణమూర్తి (1989-1994) సుమారు 5 ఏళ్లు, పేర్ని నాని (2004-2014, 2019-2024) సుమారు 15 ఏళ్లు ఎమ్మెల్యేలుగా బాధ్యతలు నిర్వర్తించగా, పేర్ని కిట్టు 2024లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరోవైపు నడకుదిటి నరసింహారావు (1999-2004) సుమారు 5 ఏళ్లు, ప్రస్తుత మంత్రి కొల్లు రవీంద్ర (2014-2019, 2024-ప్రస్తుతం) ఇప్పటివరకు సుమారు 7 ఏళ్లు ప్రాతినిధ్యం వహించారు. ఇలా ఈ ఐదుగురిలో నలుగురి ఎమ్మెల్యే పదవీకాలాలు కలిపితే అక్టోబర్ 2026 నాటికి సుమారు 32 ఏళ్ల సుదీర్ఘ పాలన సాగిందని, ఇన్ని దశాబ్దాల కాలంలో బందరుకు ఒరగబెట్టిందేమిటో శ్వేతపత్రం విడుదల చేయాలని కోన నాగార్జున ప్రజా పక్షాన నిలదీశారు.
