రచన: జన గళం అమరావతి డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యానవన రంగాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చారిత్రక అడుగులు వేస్తోంది. రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ఏకంగా రూ.1 లక్ష కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. పంటల సాగుతో పాటు రైతుల ఆర్థిక భవిష్యత్తును సమూలంగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్ రాష్ట్ర డైరెక్టర్, జనసేన పార్టీ కార్యక్రమాల కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. భవానీ రవికుమార్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం సాంప్రదాయ సాగుకే పరిమితం కాకుండా అత్యాధునిక సాంకేతికత, ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజీలు, అంతర్జాతీయ మార్కెటింగ్ అనుసంధానంతో రాయలసీమ రైతాంగానికి అత్యధిక లాభాలు చేకూరేలా ఈ ప్రాజెక్టును రూపొందించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వ దార్శనికతతో ప్రతిపాదించిన ఈ భారీ ప్రణాళిక ద్వారా రాయలసీమ రూపురేఖలు మారిపోనున్నాయని, లక్షలాది మంది రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసాతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. అన్నదాతలకు అండగా ఉంటూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.
