జన గళం ప్రత్యేక ప్రతినిధి, విజయవాడ: విజయవాడ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రధాన రహదారుల్లో ఒకటైన మహానాడు రోడ్డు, జెమినీ భవన్ హోటల్ సమీపంలో చిన్నపాటి వర్షం కురిసినా రహదారి పూర్తిగా జలమయమై చెరువును తలపిస్తోంది. సరైన డ్రైనేజీ వ్యవస్థ, వరద నీటి కాల్వల నిర్వహణ లేకపోవడంతో వర్షపు నీరు రోడ్డుపైనే పెద్ద ఎత్తున నిలిచిపోతోంది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించాలంటేనే వాహనదారులు, పాదచారులు భయపడే దుస్థితి నెలకొంది.
ముఖ్యంగా రోడ్డుపై చేరిన మురుగునీటి నిల్వల కింద ఎక్కడ గుంతలున్నాయో తెలియక ద్విచక్ర వాహనదారులు తీవ్ర భయాందోళనల నడుమ రాకపోకలు సాగిస్తున్నారు. అదుపుతప్పి గుంతల్లో పడి ప్రమాదాల బారిన పడుతున్నామని టూవీలర్ ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాలినడకన వెళ్లే సామాన్యులు, వృద్ధులు అడుగు తీసి అడుగు వేయలేని విధంగా రహదారి అంతా నీటితో నిండిపోవడంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పెద్ద వాహనాలు వెళ్లే సమయంలో ఆ బురద నీరు పాదచారులపై పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇంతటి కీలకమైన ప్రధాన మార్గంలో ఏళ్ల తరబడి ఈ సమస్య పునరావృతమవుతున్నా సంబంధిత మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంపై స్థానిక ప్రజలు, వ్యాపారులు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “చిన్న వర్షానికే రోడ్ల పరిస్థితి ఇలా ఉంటే భారీ వర్షాలు పడితే మా గతేంటి?” అని స్థానికులు వాపోతున్నారు. నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, జెమినీ భవన్ వద్ద నిలిచిన నీటిని యుద్ధప్రాతిపదికన తొలగించాలని, శాశ్వత ప్రాతిపదికన డ్రైనేజీ పూడికతీత పనులు చేపట్టి నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
