జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) అగ్రనాయకత్వం మర్యాదపూర్వకంగా కలుసుకుంది. ఈ సమావేశంలో సీపీఐ నేతలకు వైఎస్ జగన్ సాదర స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, క్షేత్రస్థాయి ప్రజా సమస్యలు, ముఖ్యంగా రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఇరు పక్షాల నేతల మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి.
వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఈశ్వరయ్య, జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి. హరినాథరెడ్డి ఉన్నారు. వీరితో పాటు వైఎస్సార్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులు, వ్యవసాయ సంక్షోభంపై చర్చించేందుకు ఈ నెల 26వ తేదీన విజయవాడ వేదికగా సీపీఐ ఆధ్వర్యంలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య అధికారికంగా ఆహ్వాన పత్రాన్ని జగన్‌కు అందజేశారు.
