జన గళం విజయవాడ బ్యూరో: విజయవాడ నగర పాలక సంస్థ (VMC) సాధారణ ఎన్నికల తుది పోలింగ్ లెక్కలు అధికారికంగా ఖరారయ్యాయి. నగరవ్యాప్తంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన ఓటింగ్ ప్రక్రియలో మొత్తం 55.35 శాతం పోలింగ్ నమోదైంది. కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 8,05,797 మంది ఓటర్లకు గాను 4,46,021 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అత్యధిక పోలింగ్‌తో మొదటి స్థానంలో నిలవగా, తూర్పు నియోజకవర్గం చివరి స్థానంలో నిలిచింది.
నియోజకవర్గాల వారీగా తుది పోలింగ్ వివరాలు:
- విజయవాడ సెంట్రల్: 57.55% పోలింగ్‌తో నగరంలోనే అగ్రస్థానంలో నిలిచింది. మధ్యతరగతి, వ్యాపార వర్గాలు భారీగా పోలింగ్ బూత్‌లకు తరలివచ్చాయి.
- విజయవాడ వెస్ట్ (పశ్చిమ): 54.43% పోలింగ్ నమోదైంది. 55వ డివిజన్‌లో సమయం పొడిగించిన అనంతరం ఇక్కడ ఓటింగ్ మరింత పుంజుకుంది.
- విజయవాడ ఈస్ట్ (తూర్పు): 53.95% పోలింగ్ రికార్డైంది. నగర సగటు కంటే ఇక్కడ కాస్త తక్కువ ఓటింగ్ నమోదైంది.
మొత్తం పోలైన 4,46,021 ఓట్లను భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించి మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఈ ఓట్లతో మేయర్ అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది.
