జన గళం క్రైమ్ డెస్క్: అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. బలిజపల్లె రోడ్డు నుంచి పీలేరు రోడ్డు వైపు వెళ్తున్న ఆటోను జేసీబీ వాహనం ఢీకొన్న ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనతో మృతుని కుటుంబంలోనూ, తిమ్మసముద్రం గ్రామంలోనూ తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.
స్థానికుల వివరాల ప్రకారం, సుండుపల్లి మండల కేంద్రంలోని అగ్రహారం వద్ద బుధవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బలిజపల్లె రోడ్డు వైపు నుంచి పీలేరు రోడ్డుకు వస్తున్న ఆటోను.. మలుపు వద్ద సుండుపల్లె వైపు వెళ్తున్న జేసీబీ అజాగ్రత్తగా ఢీకొట్టింది. ఈ భీకర ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న తిమ్మసముద్రం హరిజనవాడకు చెందిన మల్లేపల్లి మనోహర్ (55) తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 ఎమర్జెన్సీ అంబులెన్స్‌కు సమాచారం అందించారు.
క్షతగాత్రుడైన మనోహర్‌ను మెరుగైన వైద్యం కోసం వెంటనే రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆయన పరిస్థితి విషమించి మృతి చెందినట్లు బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తెలిపారు. మృతునికి భార్య, ఒక కుమారుడు మరియు కుమార్తె ఉన్నారు. కుటుంబానికి అండగా ఉండాల్సిన ప్రధాన వ్యక్తి రోడ్డు ప్రమా రూపంలో అర్ధాంతరంగా తనువు చాలించడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Slug: sundupalle-road-accident-jcb-auto-collision-death
