జన గళం ఆధ్యాత్మిక డెస్క్: ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని చారిత్రక ప్రాశస్త్యం కలిగిన మహాత్మా గాంధీ పార్క్ ప్రాంగణంలో ప్రతిష్టించిన గణనాథుని 21వ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. స్వాతంత్ర్య సమరంలో జాతిపిత మహాత్మా గాంధీ స్వయంగా బస చేసిన ప్రాంతంగా, 109 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన జమ్మి మండపం (నందనం తోట, గాంధీనగర్) వద్ద ఈ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
జై గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ 21వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా భక్తుల సౌకర్యార్థం భారీ అన్నసంతర్పణ ఏర్పాట్లు పూర్తి చేశారు. నూజివీడు పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక వసతులు కల్పించారు. భక్తజనులందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి గణనాథుని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఉత్సవ కమిటీ సభ్యులు సాదరంగా ఆహ్వానించారు.
