జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలోని పేద, మధ్యతరగతి వర్గాల ఆరోగ్య అత్యవసర సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ గారితో కలిసి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ తూర్పు నియోజకవర్గం మరియు విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త శ్రీ అమ్మిశెట్టి వాసు గారు పాల్గొన్నారు. బాధితులకు నేరుగా సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా 22వ డివిజన్‌కు చెందిన లబ్ధిదారులకు ఆరు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న పేదలకు కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా కొండంత అండగా నిలుస్తుందని నాయకులు పేర్కొన్నారు. వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయం ఎంతో మందికి పునర్జన్మను ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 22వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కలిసిపెద్ది అన్నారావు, 22వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు తోట శీను సహా స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
