కడియం నర్సరీల ప్రత్యేకతను గ్లోబల్ స్థాయిలో నిలబెట్టాలి: మంత్రి కందుల దుర్గేష్
సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఫ్లోరీ కల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు కృషి
రైతుల రుణ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి బ్యాంకింగ్ అధికారులతో త్వరలో ముఖాముఖి
కడియం నర్సరీ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ
రాజమహేంద్రవరం: కడియం నర్సరీల ప్రత్యేకతను గ్లోబల్ స్థాయిలో నిలబెట్టాలని నూతనంగా ఏర్పాటైన అసోసియేషన్ కు మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం గ్రామంలోని జీఎన్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన ‘సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్’ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పాలకవర్గ సభ్యులకు మంత్రి దుర్గేష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు సర్ ఆర్థర్ కాటన్ దొర విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ… ప్రజాస్వామ్యయుతంగా, సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో జరిగిన ఈ ఎన్నికల్లో గెలుపొందిన అసోసియేషన్, నర్సరీ రైతాంగానికి మేలు చేకూర్చేలా పనిచేయాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా కడియం నర్సరీలు సాధించిన గుర్తింపును ప్రస్తావిస్తూ, ఈ ప్రత్యేకతను కాపాడుకునేలా నూతన పాలకవర్గం శ్రద్ధ వహించాలన్నారు. నర్సరీ రంగంలో 10 శాతం రైతులు మాత్రమే ఆర్థిక పరిపుష్టి సాధించారని, 90 శాతం మంది చిన్న, సన్నకారు రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుణాల మంజూరులో ఉన్న ఇబ్బందులను తొలగించేందుకు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి త్వరలోనే బ్యాంకింగ్ ప్రతినిధులు, అసోయేషన్, నర్సరీ రైతులతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆధునిక పూలసాగు పద్ధతులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతిపాదనలు పంపిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ప్రాంతీయంగా ‘ఫ్లోరీ కల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ ఏర్పాటుకు కృషిచేస్తామన్నారు. గతంలో నర్సరీలకు ఉచిత విద్యుత్ కొనసాగించడంలో, వాల్టా చట్టం విషయంలోనూ ప్రత్యేక చొరవ తీసుకున్నామని గుర్తుచేశారు. అటవీ ప్రాంతాలకు పర్యావరణ హితమైన మొక్కల సరఫరా అనుమతులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు.కడియం నర్సరీ రంగం తమకు సొంతింటి లాంటిదని పేర్కొంటూ, చిట్టచివరి రైతుకు సైతం సంక్షేమ ఫలాలు అందేలా అసోసియేషన్ స్పష్టమైన కార్యాచరణతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా నర్సరీ రైతుల సంక్షేమానికి, అభివృద్ధికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన మాజీ నర్సరీ అధ్యక్షులు రత్నం అయ్యప్పను మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు.
నూతన అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన బొర్సు సుబ్బారాయుడుతో పాటు పాలకవర్గ సభ్యులు కామిశెట్టి వెంకటేష్, ఉండమట్ల అర్జున్, దూలం సత్యనారాయణమూర్తి, గట్టా కృష్ణ భగవాన్, సానా పల్లపురాజు, డేగల రాము, పుల్లా శ్రీను, బోడపాటి చంద్రశేఖర శ్రీనివాస్, పాటంశెట్టి శ్రీనివాస్, తాడాల సత్యనారాయణ, అన్నందేవుల వెంకటేశ్వరరావు మరియు ఇతర సభ్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలుపుతూ అందరి మన్ననలు పొందేలా పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.
జారీ చేసిన వారు:పీఆర్వో, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు
