జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: జనసేన పార్టీ శాసనమండలి సభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారిని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు ఆత్మీయంగా పరామర్శించారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న పిడుగు హరిప్రసాద్ ప్రస్తుతం మంగళగిరిలోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కందుల దుర్గేష్ నేరుగా ఆయన నివాసానికి చేరుకుని యోగక్షేమాలను విచారించారు.
ఈ సందర్భంగా హరిప్రసాద్ గారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్య చికిత్సల వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. పిడుగు హరిప్రసాద్ గారు త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని, యథావిధిగా ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టి తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని మంత్రి కందుల దుర్గేష్ మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో పలువురు నాయకులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.
