జన గళం అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధాని అమరావతి అనుసంధానత (కనెక్టివిటీ) దిశగా మరో భారీ మైలురాయి నమోదైంది. రాజధాని నగరానికి అత్యంత కీలకమైన అమరావతి నూతన రైల్వే లైన్ నిర్మాణ పనులకు సంబంధించి అధికారికంగా టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 58 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ రైల్వే లైన్ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేసేందుకు వీలుగా మూడు ప్రత్యేక ప్యాకేజీలుగా విభజించి పనులను చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.
ఈ రైల్వే లైన్ పనులను మూడు ప్యాకేజీలుగా చేపట్టడం వల్ల సమాంతరంగా నిర్మాణాలు జరిగి, నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి కావడానికి మార్గం సుగమమైంది. ఇప్పటికే ప్రతిపాదిత ఔటర్ రింగ్ రోడ్ (ORR) మరియు ఈ రైల్వే కనెక్టివిటీ ప్రాజెక్టులు ఒకేసారి పట్టాలెక్కితే రాజధాని అమరావతి రూపురేఖలు సమూలంగా మారిపోనున్నాయి. ప్రయాణికుల రాకపోకలతో పాటు సరుకు రవాణాకు అమరావతి ప్రధాన కేంద్రంగా మారనుంది. అయితే టెండర్ల ప్రక్రియ ముగిసిన అనంతరం క్షేత్రస్థాయి నిర్మాణ పనుల్లోనూ ఇదే విధమైన వేగం, చిత్తశుద్ధి కొనసాగాలని నిపుణులు, స్థానికులు భావిస్తున్నారు. పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసినప్పుడే భూములిచ్చిన రైతుల త్యాగాలకు తగిన గుర్తింపు లభించడంతో పాటు, ఐదు కోట్ల ఆంధ్రుల కలలు, ఆశలు నిజమవుతాయని రాజధాని వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
