జన గళం విజయవాడ బ్యూరో: ప్రముఖ శైవక్షేత్రం, ద్వాదశ జ్యోతిర్లింగ-అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో అత్యంత వైభవంగా జరగనున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు హాజరుకావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్‌కు అధికారిక ఆహ్వానం అందింది. మంగళవారం విజయవాడలోని లోక్ భవన్‌లో దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) శ్రీ ఎం. శ్రీనివాసరావు ఆలయ వేద పండితులు, ప్రధానార్చకులతో కలిసి గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఈవో శ్రీనివాసరావు శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను గవర్నర్‌కు అందజేసి, ఉత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసి స్వామి-అమ్మవార్ల కృపాకటాక్షాలు అందుకోవాలని సాదరంగా ఆహ్వానించారు. ఆలయ వేద పండితులు గవర్నర్‌కు వేద మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక ఆశీర్వచనం అందజేసి, స్వామివారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు, శ్రీశైల క్షేత్ర చిత్రపటాన్ని బహూకరించారు. అనంతరం ఉత్సవాల సందర్భంగా శ్రీశైలంలో భక్తుల కోసం చేపట్టిన ప్రత్యేక క్యూలైన్లు, అన్నదానం, లడ్డూ ప్రసాదాల నిల్వలు, పటిష్ట భద్రతా ఏర్పాట్లను ఈవో గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆలయ ఆహ్వానాన్ని గవర్నర్ సంతోషంగా స్వీకరిస్తూ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
