జన గళం కాకినాడ బ్యూరో: పేద విద్యార్థుల ఉన్నత చదువులకు చేయూతనివ్వడమే పరమావధిగా కాకినాడ నగరంలో ‘క్యాప్స్ రాక్స్’ (Kapsrocks) టీమ్ ఆధ్వర్యంలో వార్షిక స్కాలర్‌షిప్ పంపిణీ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కమ్యూనిటీలోని నిరుపేద విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే సదుద్దేశంతో చేపట్టిన ఈ సేవా కార్యక్రమానికి కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ (టీ టీ కప్) విశాల హృదయంతో స్పందించారు. ఎంపీ తన వంతుగా రూ.5 లక్షల భారీ ఆర్థిక విరాళాన్ని అందజేసి విద్యార్థులకు అండగా నిలిచారు.
ఎంపీ అందించిన సహకారంతో పాటు, కాకినాడ టీమ్ సమష్టి కృషితో మొత్తం రూ.12 లక్షల రూపాయల ఉపకార వేతనాలను (స్కాలర్‌షిప్‌లు) ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు వేదికపై అందజేశారు. విద్యతోనే సమాజంలో మార్పు, ఆర్థిక సాధికారత సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ఎంపీ పేర్కొన్నారు. అంతేకాకుండా, విద్యార్థుల విద్యకు తన వంతు సహకారం నిరంతరం కొనసాగుతుందని ప్రకటిస్తూ.. వచ్చే విద్యా సంవత్సరానికి కూడా మరో రూ.5 లక్షల విరాళాన్ని ఇస్తానని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ హామీ ఇవ్వడంతో సభలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇంతటి మహోన్నత కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన క్యాప్స్ రాక్స్ కాకినాడ బృందాన్ని, నిర్వాహకులను పలువురు ప్రశంసలతో ముంచెత్తారు.
