జన గళం తిరుమల బ్యూరో: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సమాచారం అందించింది. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు మరియు పవిత్ర పెరటాసి మాసం రద్దీని పురస్కరించుకుని అక్టోబర్ 12, 13, 14, 18, 19, 20వ తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (SED) టికెట్లను అక్టోబర్ 7, బుధవారం ఉదయం 10:00 గంటలకు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయనుంది. భక్తులు దళారులను నమ్మి మోసపోకుండా కేవలం టీటీడీ అధికారిక పోర్టల్ (ttdevasthanams.ap.gov.in) ద్వారా మాత్రమే తమ దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.
మరోవైపు, అక్టోబర్ 11 నుండి 20వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. దీనికి తోడు తమిళుల పవిత్ర పెరటాసి మాసంలో చివరి వారం కావడంతో తిరుమలకు పోటెత్తే సామాన్య భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ పది రోజుల పాటు కేవలం ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితంగా బ్రేక్ దర్శనం కల్పిస్తూ, ఇతర అన్ని రకాల వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. అలాగే వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్నారైలు మరియు డిఫెన్స్ కేటగిరీలకు సంబంధించిన ప్రివిలేజ్డ్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 10 నుండి 19వ తేదీ వరకు ఎలాంటి వీఐపీ బ్రేక్ సిఫార్సు లేఖలు స్వీకరించబడవని, సామాన్య భక్తుల సౌకర్యార్థం తీసుకున్న ఈ నిర్ణయాలను గమనించి భక్తులు తమ తిరుమల యాత్రా ప్రణాళికను రూపొందించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
