జన గళం విజయవాడ బ్యూరో: భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజాప్రతినిధిగా, రాజనీతిజ్ఞుడిగా 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజా ప్రస్థానాన్ని (గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నేటి వరకు) విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై విశేష పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు బుధవారం తెల్లవారుజామున 5:00 గంటలకు ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరిట వేద పండితులు అత్యంత నిష్టతో ప్రత్యేక ‘ఖడ్గమాల అర్చన’ పూజా క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మోదీ గోత్రనామాలతో సంకల్పం చేసి, ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని జగన్మాత కనకదుర్గమ్మను వేడుకున్నారు. ప్రధాని మోదీ దార్శనిక నాయకత్వంలో దేశం ‘వికసిత్ భారత్’ దిశగా మరింత వేగంగా దూసుకుపోవాలని, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్, రాజధాని అమరావతి నిర్మాణం, ఉత్తరాంధ్ర ముఖద్వారమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి బృహత్తర ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తయి రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పూజా కార్యక్రమం అనంతరం అమ్మవారి పవిత్ర శేషవస్త్రాలు, తీర్థ ప్రసాదాలు మరియు అమ్మవారి దివ్య చిత్రపటాన్ని ప్రధానమంత్రి కార్యాలయానికి (PMO) ప్రత్యేకంగా పంపించారు.
