జన గళం క్రైమ్ డెస్క్: కృష్ణా జిల్లా ఉయ్యూరు టౌన్ పరిధిలో సంచలనం సృష్టించిన బాలికపై అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ, పెళ్లి పేరుతో బాలికను నమ్మించి మోసగించి, లైంగిక దాడికి పాల్పడిన సాపురం గ్రామానికి చెందిన కూచిపూడి రాంబాబు (23)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు మైనర్‌గా ఉన్నప్పటి నుంచే ఆమెను వేధిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన నిందితుడు, ఆమె మేజరైన తర్వాత పెళ్లి చేసుకోవాలని కోరగా కులాన్ని అడ్డంపెట్టి వివాహానికి నిరాకరించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
బాధితురాలి ప్రవర్తనలో మార్పును గమనించిన తల్లిదండ్రులు ఆరా తీయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు నాలుగు రోజుల క్రితం ఉయ్యూరు టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు బీఎన్ఎస్ (BNS), పోక్సో (POCSO) చట్టంతో పాటు ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు గన్నవరం డీఎస్పీ కే. జయకృష్ణ పర్యవేక్షణలో ఉయ్యూరు టౌన్ సీఐ టి.వి.వి. రామారావు, ఎస్సై మల్లికాసులు ఈ కేసులో దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇదే కేసుకు సంబంధించి మరో ముగ్గురి పాత్రపై కూడా లోతుగా దర్యాప్తు జరుపుతున్నామని, త్వరలోనే లభించే ఆధారాలను బట్టి వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు.
ఈ సందర్భంగా గన్నవరం డీఎస్పీ కే. జయకృష్ణ మీడియాతో మాట్లాడుతూ మహిళలు, పిల్లలపై జరిగే అఘాయిత్యాల పట్ల పోలీసు శాఖ అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ప్రేమ, పెళ్లి పేర్లతో బాలికలను మోసగించి లైంగిక దాడులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా సమగ్ర దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు. వేధింపులు లేదా లైంగిక దాడులకు గురైన మహిళలు, బాలికలు ఎలాంటి భయానికి గురికాకుండా ధైర్యంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు. బాధితుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతూ, వారికి అవసరమైన రక్షణ మరియు అండదండలు అందిస్తామని భరోసా కల్పించారు.
Slug: uyyuru-town-minor-rape-case-accused-arrested-dsp-jayakrishna
