జన గళం బిజినెస్ బ్యూరో/హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయి వ్యాపారవేత్తలు, వాణిజ్య ప్రతినిధులు, నవతరం పారిశ్రామికవేత్తలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే అత్యంత ప్రతిష్టాత్మక వాణిజ్య మహోత్సవం ‘సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్ (SAMAKHYA 2026)’ సదస్సుకు కౌంట్‌డౌన్ మొదలైంది. వచ్చే బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా బిజినెస్ ఈవెంట్‌కు కేవలం 7 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉందని నిర్వాహకులు ప్రకటించారు. అక్టోబర్ 14, 15 తేదీల్లో హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక హైటెక్స్ (HITEX) ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఈ రెండు రోజుల గ్లోబల్ సదస్సు అట్టహాసంగా జరగనుంది.
ఈ సదస్సు వ్యాపార వృద్ధి, అంతర్జాతీయ పెట్టుబడులు, నెట్‌వర్కింగ్ విస్తరణ, నూతన మార్కెట్ అవకాశాలను అన్వేషించేందుకు ఒక అద్భుత వేదికగా నిలవనుంది. దేశ విదేశాల నుంచి ప్రముఖ వ్యాపారవేత్తలు, యూకే ప్రతినిధులు, పరిశ్రమల దిగ్గజాలు, అంకుర సంస్థల వ్యవస్థాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ వ్యాపార ప్రణాళికలను పంచుకోనున్నారు. సరికొత్త భాగస్వామ్యాలు, ఒప్పందాలు, పారిశ్రామిక వేదికలకు సమగ్ర మార్గదర్శిగా నిలిచే ఈ సదస్సు కోసం వ్యాపార ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
