జన గళం ప్రత్తిపాడు/శంఖవరం బ్యూరో: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో బుధవారం (07-10-2026) “విక్టరీ విజన్ ఒకేషనల్ జూనియర్ కాలేజ్” వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా, కోలాహలంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మేడిశెట్టి సూర్య కిరణ్ (బాబి) ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ వారికి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకేషనల్ విద్య ద్వారా యువత త్వరితగతిన సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకుని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ డైరెక్టర్ శ్రీ వెన్నా ఈశ్వరుడు (శివ), శంఖవరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గాబు సుభాష్, మాజీ ఎంపీటీసీ శ్రీ కంచిబోయిన శ్రీను, కళాశాల వ్యవస్థాపకులు శ్రీ గుడాల రామకృష్ణతో పాటు అధ్యాపక బృందం, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాంస్కృతిక ప్రదర్శనలతో విద్యార్థులు అలరించగా, ప్రతిభ కనబరిచిన వారికి అతిథులు అభినందనలు తెలిపారు. విద్యారంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం నిరంతరం ప్రోత్సాహం అందిస్తుందని నేతలు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
