జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం మంటాడ గ్రామంలోని జగనన్న కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయాన్నే పమిడిముక్కల మండలం మంటాడ గ్రామంలోని జగనన్న కాలనీలో పామర్రు శాసనసభ్యులు శ్రీ వర్ల కుమార్ రాజా గారు పర్యటించారు. కాలనీ వాసులతో నేరుగా ముఖాముఖి మాట్లాడి, తాగునీరు, విద్యుత్ సరఫరా, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మరియు జంగిల్ క్లియరెన్స్ వంటి వివిధ మౌలిక వసతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు తమ దుస్థితిని ఎమ్మెల్యే ఎదుట వెళ్ళబోసుకున్నారు. “గత ప్రభుత్వ హయాంలో పాలకులు, స్థానిక నాయకులు మమ్మల్ని, మా కాలనీలోని సమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదు” అని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వసతులు లేక తాము పడుతున్న ఇబ్బందికర పరిస్థితులను వివరించారు. ప్రజల సమస్యలను శ్రద్ధగా ఆలకించిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే కాలనీవాసులు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
గత పాలకుల అలసత్వం వల్ల అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నింటినీ త్వరలోనే సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా చర్చించి, త్వరితగతిన పరిష్కరిస్తానని ఆయన కాలనీవాసులకు గట్టి హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ మెరుగైన వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల సీనియర్ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు మంటాడ జగనన్న కాలనీ నివాసితులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
Slug: mantada-jagananna-colony-visit-varla-kumar-raja
