జన గళం 24 ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ నెల పదిహేడో తేదీన కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనను అపూర్వ రీతిలో విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ ఉప సభాపతి బూరగడ్డ వేదవ్యాస్ పార్టీ శ్రేణులకు, కూటమి నాయకులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన పెడనలో ఒక సమగ్ర ప్రకటన విడుదల చేస్తూ మంత్రి రాక సందర్భంగా చేపట్టాల్సిన స్వాగత ఏర్పాట్లు, ర్యాలీ వివరాలను వెల్లడించారు.
పర్యటన వివరాల ప్రకారం ఈ నెల పదిహేడో తేదీ ఉదయం పది గంటలకు పెడన పట్టణ పరిధిలోని తామర చెరువు సెంటర్ వద్ద మంత్రి నారా లోకేష్‌కు కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలకనున్నాయి. అనంతరం అక్కడి నుంచి భారీ మోటార్ సైకిల్ ర్యాలీతో మచిలీపట్నం-పెడన ప్రధాన రహదారి మీదుగా ఫ్లైఓవర్ ఎదురుగా ఉన్న బేరాక ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ వేదిక వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రజలను, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఈ సందర్భంగా బూరగడ్డ వేదవ్యాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తూ ప్రజా పాలన అందిస్తోందని కొనియాడారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో యువనేత లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు విద్యా రంగంలో చారిత్రాత్మక మార్పులు తెస్తున్నారని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని, పెడన పర్యటనకు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో పాటు ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
