Slug: thotlavalluru-yakamuru-community-hall-foundation-stone-mp-balashowry-mla-kumar-raja
జనగళం 24 ఆంధ్ర డెస్క్: కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గ పరిధిలోని తోట్లవల్లూరు మండలం యాకమూరు గ్రామంలో రూ.75 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు అత్యంత వైభవంగా శంకుస్థాపన జరిగింది. ఎన్టీపీసీ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల కింద మంజూరైన ఈ భవన నిర్మాణానికి మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా ముఖ్య అతిథులుగా హాజరై శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజల సామాజిక, సాంస్కృతిక అవసరాలకు ఈ భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని నేతలు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే కుమార్ రాజా మాట్లాడుతూ గ్రామాల సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో భాగంగా ప్రజాప్రయోజనార్థం ఈ కమ్యూనిటీ హాల్‌ను అన్ని సదుపాయాలతో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు వీరంకి వెంకట గురుమూర్తి, పామర్రు జనసేన ఇన్‌ఛార్జ్ తడిశెట్టి నరేష్, తోట్లవల్లూరు మండల టీడీపీ అధ్యక్షులు వీరపనేని శివరాం, ప్రముఖ నాయకులు రామినేని కుటుంబయ్య, రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్ డైరెక్టర్ కృష్ణ సుమన్, గ్రామ టీడీపీ అధ్యక్షులు చొప్పరపు సుబ్రహ్మణ్యంతో పాటు కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
