జన గళం విజయవాడ సెంట్రల్ బ్యూరో: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు వెల్లువెత్తాయి. పాయకపురంలోని MSR కన్వెన్షన్ హాల్ వేదికగా ప్రముఖ వ్యాపారవేత్త సాయి సంజయ్ ఆధ్వర్యంలో సుమారు 300 మంది యువకులు, స్థానిక ప్రముఖులు ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే శ్రీ బొండా ఉమామహేశ్వరరావు సమక్షంలో టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన నూతన సభ్యులందరికీ ఎమ్మెల్యే బొండా ఉమా పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకత్వం, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రగతిశీల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ప్రజల్లో సంపూర్ణ విశ్వాసాన్ని నింపుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణమే ధ్యేయంగా సాగుతున్న ఈ మంచి ప్రభుత్వ పాలనను చూసి అన్ని వర్గాల ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. పార్టీని నమ్ముకుని వచ్చిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం, సముచిత స్థానం కల్పిస్తామని, అందరం ఐక్యంగా ముందుకు సాగుతూ పార్టీ సంస్థాగత బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నేతలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
