జనగళం 24 ఆంధ్ర డెస్క్: బాలల బంగారు భవిష్యత్తుకు అంగన్వాడీలే బలమైన పునాది అని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం దుగ్గిరాలపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్ర భవనాన్ని ఆయన ఘనంగా ప్రారంభించారు. మహిళలు, చిన్నారులు, గర్భిణులు, బాలింతల పోషణ, ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న పౌష్టికాహారం, వైద్య సేవలు మరింత నాణ్యతతో లబ్ధిదారులకు అందేలా సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పిల్లల ఎదుగుదల, బరువు, ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, ఎక్కడా నిర్లక్ష్యానికి తావులేకుండా పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ అక్కల రామ్మోహనరావు, కూటమి ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
